అగ్ర దేశాల వీసాల్లో మనోళ్లదే హవా.. స్థానికుల కన్నా భారత నిపుణులకే ఎక్కువ జీతాలు.. ఎందుకంటే?

  • అగ్ర దేశాల స్కిల్డ్ వీసాల్లో భారతీయుల ఆధిపత్యం
  • నైపుణ్య కొరత వల్లే నియామకాలు, జీతాలు కూడా అధికం
  • యూఎస్, యూకేలలో స్థానికుల కన్నా మనోళ్లకే ఎక్కువ వేతనాలు
  • భారత టాలెంట్‌ను ఆకర్షిస్తున్న ఆస్ట్రేలియా, జర్మనీ
ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు భారత్ ఒక ప్రధాన కేంద్రంగా మారుతోంది. అగ్రరాజ్యం అమెరికా నుంచి యూరప్‌ దేశాల వరకు కీలకమైన స్కిల్డ్ వర్కర్ వీసా ప్రోగ్రామ్‌లలో భారతీయులే అగ్రస్థానంలో నిలుస్తున్నారని వర్క్‌ఫోర్స్ మేనేజ్‌మెంట్ సేవల సంస్థ 'డీల్' (Deel) తన తాజా నివేదికలో వెల్లడించింది. చౌకగా లభిస్తారనే కారణంతో కాకుండా అరుదైన నైపుణ్యాల కొరత కారణంగానే కంపెనీలు భారత నిపుణులకు పెద్దపీట వేస్తున్నాయని ఈ నివేదిక స్పష్టం చేసింది.

నివేదిక ప్రకారం.. అమెరికా జారీ చేసే హెచ్-1బీ వీసాల్లో భారత్ మొదటి స్థానంలో ఉండగా, యూకే స్కిల్డ్ వర్కర్ వీసాలు, యూరోపియన్ యూనియన్ (ఈయూ) బ్లూ కార్డ్‌ల జారీలో రెండో స్థానంలో నిలిచింది. యూఏఈ జారీ చేసే గోల్డెన్ వీసాలు, సాధారణ ఉపాధి వీసాల్లో కూడా భారతీయులదే ఆధిపత్యం. ఇప్పటికే యూఏఈ మొత్తం జనాభాలో భారతీయులు 38 శాతం ఉండటం గమనార్హం. భారత నిపుణులను నియమించుకోవడంలో ఆస్ట్రేలియా (724 శాతం), యూకే (142 శాతం), అమెరికా (139 శాతం) భారీ వృద్ధిని నమోదు చేశాయి.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పలు దేశాల్లో స్థానిక ఉద్యోగులతో పోలిస్తే భారత వీసాదారులే ఎక్కువ జీతాలు పొందుతున్నారు. అమెరికాలో హెచ్-1బీ వీసాదారుల సగటు వార్షిక వేతనం 1,40,000 డాలర్లు కాగా, అక్కడి పౌరులకు సమానమైన పాత్రల్లో 1,30,000 డాలర్లుగా ఉంది. యూకేలో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. ఇది నైపుణ్యానికి కంపెనీలు ఇస్తున్న విలువను సూచిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

భారత నిపుణుల కోసం జర్మనీ వంటి కొత్త మార్కెట్లు కూడా తలుపులు తెరుస్తున్నాయి. ఉద్యోగ ఆఫర్ లేకపోయినా నైపుణ్యం ఆధారంగా వీసా ఇచ్చే జర్మనీ 'ఆపర్చునిటీ కార్డ్' ప్రోగ్రామ్‌లో ఇప్పటివరకు జారీ అయిన పర్మిట్లలో దాదాపు మూడో వంతు భారతీయులకే దక్కాయి. ఇంజనీరింగ్, సాఫ్ట్‌వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డిజిటల్ సేవల రంగాల్లో భారత టెక్ నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉందని నివేదిక పేర్కొంది. భవిష్యత్తులో దేశీయంగా అవకాశాలు పెరిగితే, విదేశాల్లో శిక్షణ పొందిన ఈ నిపుణులు తిరిగి స్వదేశానికి వచ్చే అవకాశం ఉందని కూడా అంచనా వేసింది.

Indian Professionals
H-1B Visa
Skilled Worker Visas
Global Salary Trends
Germany Opportunity Card
Deel Report

More Telugu News